ఇటీవల అమీన్ పూర్ లో వెలుగు చూసిన ముగ్గురు చిన్నారుల హత్య కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కన్నతల్లే ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసిందని పోలీసులు తేల్చేశారు. నిందితులు రజిత, శివను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్లితే.. రజిత అలియాస్ లావణ్యకు తనకంటే 20 ఏళ్ల పెద్దవాడైన అపురిచింత చెన్నయ్యతో పెల్లి జరిగింది. వీరికి సాయి కృష్ణ(12), మదుప్రియ(10), గౌతమ్(8) ముగ్గురు సంతానం. వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం, మెదక్ పల్లి గ్రామం.
మూడేళ్ల కిందట అమీన్ పూర్ గ్రామం.. బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా.. రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పని చేస్తున్నారు. అయితే 6 నెలల క్రితం రజిత 10వ తరగతి స్నేహితులందరూ కలిసి గెట్ టూ గెదర్ పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో తన క్లాస్ మెట్ శివతో స్నేహం మరింతగా ఏర్పడి రోజు చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. రజితకు చెన్నయ్యకు ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండటంతో మొదటి నుంచి రజితకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని.. తనను పెల్లి చేసుకోమని శివను అడిగింది. పిల్లలు లేకుంటే చేసుకునేవాడిని.. నీకు పిల్లలు ఉన్నారని శివ చెప్పడంతో.. శివను పెళ్లి చేసుకోవడానికి పిల్లలను చంపేసింది. పోలీసులు అరెస్ట్ చేశారు.