నాంపల్లి కోర్టులో విచారణకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇవాళ విచారణకు హాజరయ్యారు. 2017లో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో కేసు నమోదు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేసినందుకు కేసు నమోదు అయింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసులు ఆయనతో పాటు హర్కర వేణుగోపాల్, అన్నయ్య గౌడ్, శశిభూషణ్ కాచె, మరో 9 మంది పై కేసులు పెట్టారు.
విచారణలో భాగంగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి కోర్టులో మంత్రి హాజరయ్యారు. శాంతియుతంగా ఆందోళన చేసినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐపీసీ 147, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు పెట్టిందని శ్రీధర్ బాబు తరపు అడ్వకేట్ కోర్టుకు వివరించారు. గత డిసెంబర్ లో కేసు పై హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ ను కొట్టేసింది. కింది కోర్టులో హాజరయ్యే అంశంలో మినహాయింపు ఇచ్చింది.