భారత్, ఇంగ్లండ్‌ల మధ్య 3వ టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరగనున్న విషయం విదితమే. ఇప్పటికే సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ గెలిచిన రెండు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో మూడో టెస్టులో ఎవరు గెలుస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అంతా బాగానే ఉన్నా.. మొతెరా స్టేడియంలో సీట్ల కలర్ ప్లేయర్లకు ఇబ్బందులను కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొతెరా స్టేడియాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. స్టేడియం మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. దీంతో ప్రస్తుతం స్టేడియం లుక్ అద్భుతంగా ఉంది. ఇక సీట్లను కూడా భిన్న రకాల కలర్లు ఉండేలా తీర్చిదిద్దారు. అయితే సీట్లకు మరీ ఆకర్షణీయమైన రంగులను వాడారు. దీంతో ఆ రంగుల వల్ల ప్లేయర్లకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఇంగ్లండ్ బ్యాటింగ్ అసిస్టెంట్ కోచ్ గ్రాహమ్ థోర్ప్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. స్టేడియంలో సీట్ల కలర్ వల్ల ప్లేయర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని అన్నాడు.
సాధారణంగా క్రికెట్ స్టేడియాల్లో సీట్లకు అంత ప్రకాశవంతమైన కలర్లను ఉపయోగించరు. ఎందుకంటే వన్డే, టెస్టు ఏ తరహా మ్యాచ్ ఆడినా ప్లేయర్లకు బంతి స్పష్టంగా కనిపించాలి. అందుకు అనుగుణంగా సీట్లకు కలర్ వేస్తారు. కానీ ఇటీవల విడుదల చేసిన మొతెరా స్టేడియం లోపలి సీట్ల కలర్‌ను చూస్తే చాలా బ్రైట్‌గా కనిపిస్తోంది. అందువల్ల నిపుణులు అంటున్నట్లుగా నిజంగానే సీట్ల కలర్ ప్లేయర్లకు ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంటుందని స్పష్టమవుతుంది. అయితే మ్యాచ్ ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడే ఈ విషయంపై స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంటుంది.