గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్‌ను, ఆ పార్టీ నేతలతో పాట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోన్న ఆ పార్టీ అసంతృప్త ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని టార్గెట్ చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా వైసీపీ ఎంపీలు అందరూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఏపీలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై ప్రభుత్వాన్ని ఏకేస్తున్నారు.
తాజాగా ఈ రోజు పార్లమెంటు దగ్గర మరోసారి మీడియాతో మాట్లాడిన ఆయన ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత మిథున్‌రెడ్డి టార్గెట్‌గా విరుచుకు పడ్డారు. ఆయన ఏనాడు అయినా పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై మాట్లాడారా ? ప‌్రత్యేక హోదా అంశాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే రైల్వే జోన్‌పై మిథున్ రెడ్డి ఏం సాధించారని రఘు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యే అర్హతే లేదన్నారు. పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ఎన్నికలు పెడితే మిథున్ రెడ్డికి మూడు ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే మిథున్ రెడ్డికి ఒకటి రెండు ఓట్లు మించి రావు.. మిగిలిన ఓట్లు అన్ని నాకే వస్తాయని రఘు చెప్పారు. అలాగే పార్టీలో ఒక మతస్తులు, ఒక కులస్తులకే పదవులు అన్ని కట్టబెడుతున్నారని.. పార్టీ అంటే ఒక కులం కాదు.. ఒక మతం కాదని ఆయన చెప్పారు. అయ్యా మిథున్ రెడ్డి గారు రెడ్డి కులస్తులు అందరూ మంచి సీట్లు తీసుకుంటున్నారు… రాజ్యసభ విజిటింగ్ గ్యాలరీలో కొందరిని కూర్చోపెట్టి… కనీసం 50 శాతం అటిండెన్స్ లేని మీ సామాజిక వర్గ నేతలతో పాటు.. మీ అడుగులకు మడుగులు ఒత్తేవారికే పెద్ద పీఠ వేశారని రఘు విమర్శించారు.
మరోవైపు రఘు సీఎం జగన్‌కు కులం, మతం పట్టింపులు లేవంటూనే ఏకేయడం విశేషం. ఇక మిథున్‌రెడ్డి ఈ పార్లమెంటు సమావేశాల్లో రఘురామ కృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌ను కోరతామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని రఘు కౌంటర్ వేసినట్టు తెలుస్తోంది.
-vuyyuru subhash