ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై జగన్ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేయడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ‘‘ఐదేళ్లు కుటుంబమంతా రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోడ్లపై ర్యాలీలు రద్దంటారా? ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా? మీరు ఐదేళ్లు తిరిగినప్పుడు గత ప్రభుత్వం నిషేధం విధించలేదే? చిన్న ఘటన జరగకుండా చూసిందిగానీ.. రద్దు చేయలేదే? దీనిబట్టి ర్యాలీలు, సభలకు బందోబస్తు ఇవ్వడం మీకు చేతకాదని అర్థం చేసుకోవాలా?’’ అని రఘురామ ఘాటుగా విమర్శించారు.
ఏపీలో రోడ్ షో సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని ఆదేశాల్లో హోంశాఖ పేర్కొంది.