ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని మున్నేరువాగుకు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. దీంతో ఎపుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఏపీకి మరోసారి తుపాన్ ఎఫెక్ట్ ఉన్నందున అది తీరం దాటే సమయంలో ఆ రాష్ట్రంలో సరిహద్దును పంచుకుంటున్న ఉమ్మం ఖమ్మం జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరిగింది. వరద మొదటి ప్రమాద హెచ్చరిక 16 అడుగులకు కాగా, 15.75 అడుగుల మేరకు చేరువైంది. ఆదివారం సాయంత్రానికి క్రమంగా వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.అప్పటికే అధికారులు అప్రమత్తమై స్థానికులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే మరోసారి మున్నేరు వాగు ఉగ్రరూపానికి ఖమ్మం నగరం మునిగిపోవడం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.