దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని కంకణం కట్టుకున్న ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే 2019 తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – ఎన్డీఏ మిత్ర పక్షాలను దూరం చేసుకున్న అధికార పార్టీ మరోసారి వారిని అక్కున చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్డీఏ కూటమి భేటీకి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా ఎన్డీయే కూటమి సమావేశానికి పిలుపునిచ్చి.. ఎన్నికలకు సమరశంఖాన్ని పూరిస్తున్నాయి. ఎన్డీఏ పరిధి గత కొన్నాళ్లుగా పెరుగుతూ వస్తోందని జేపీ నడ్డా అన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఎంతోమంది ప్రశంసలు అందుకున్న ప్రధాని మోదీ బలమైన నాయకత్వాన్ని అందరం చూశామని చెప్పారు. మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాల సానుకూల ప్రభావం కారణంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్డీయే కూటమిని దేశానికి సేవ చేసేందుకు, బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమిగా అభివర్ణించారు. యూపీఏకు నాయకుడే కాదని, బలమైన నిర్ణయాలు తీసుకునే శక్తీ లేదన్నారు.