ఒకప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్! అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారన్నారు. అయినా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలట అన్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారు. నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. రాహుల్ గాంధీకి రైతుల కష్టాల గురించి ఏం తెలుసన్న మంత్రి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారని కొనియాడారు.