మహానటి హిట్ తో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. వయసులో చిన్న వాడైనా….మ్యాటర్ ఉన్న వాడినని రెండవ సినిమాతోనే నిరూపించాడు. విజన్ గల దర్శకుడిగా నిరూపించుకున్నాడు. టాలీవుడ్ లో బయోపిక్ లకు ఆద్యం పోసిన దర్శకుడిగా కీర్తింపబడుతున్నాడు. దీంతో ఒక్కసారిగా సీనియర్ హీరోల నుంచి జూనియర్ల వరకూ అంతా అతని వైపు చూసారు. మహానటి విడుదలై సరిగ్గా మొన్నటి మేకి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటివరకూ కొత్త సినిమా ప్రకటన రాలేదు. అంతటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా ఈ గ్యాప్ ఏంటి? అవకాశాలు లేక అనుకుంటున్నారా? అయితే పొరబడినట్లే? ఈ గ్యాప్ తో పదేళ్ల పాటు టాలీవుడ్ చరిత్ర చెప్పుకునే లా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
మహానటి రిలీజ్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నాగ్ అశ్విన్ ను ఇంటికి పిలిపించి లంచ్ పార్టీ ఇచ్చారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఆ సమయంలోనే తనకు ఒక మంచి కథ ఉంటే సిద్దం చేయ్ అని చిరు బాహాటంగా ప్రకటించారు. అది సోషయా ఫాంటసీ నేపథ్యంలా ఉండాలి. పాతాళ భైరవి కథలా ఉండాలని ఓ హింట్ కూడా ఇచ్చారు. ఆ మాటను సీరియస్ గా తీసుకున్న నాగ్ అశ్విన్ అప్పటి నుంచి చిరు కోసం కథ సిద్దం చేసే పనిలోనే ఉన్నాడని తాజాగా ఉప్పందింది. ఏడాదిగా గ్యాప్ తీసుకోవడానికి ప్రధాన కారణం అదేనని అంటున్నారు. ప్రస్తుతం చిరును మెప్పించే కథ కోసమే కసరత్తులు చేస్తున్నాడని వినిపిస్తోంది. చిరు ఎక్స్ పక్టేషన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా కథను సిద్దం చేస్తున్నాడుట.
దీనిలో భాగంగా తన ఇంటినే ఓ లైబ్రెరీగా మార్చేసాడుట. పుస్తకాలు చదవడం…అందులో అవసరమైన పాయింట్లను తీసుకుని రిఫరెన్స్ గా కథ రాసుకోవడంలో వాడుకుంటున్నాడు. ఏడాది కాలంగా ఇదే పనిమీద ఉన్నాడుట. చాలా మంది నిర్మాతలు తమ బ్యానర్లో సినిమా చేయమని అడ్వాన్సులు తీసుకుని ఇంటికొచ్చి ఆఫర్ ఇచ్చినా కాదంటున్నారుట. చిరు ప్రామిస్ చేసారు కాబట్టి నాగ్ అశ్విన్ కథ తో మెప్పిస్తే ఛాన్స్ తప్పక ఉంటుంది. ఇక నిర్మాతలు ఇంట్లోనే ఉన్నారు. మామ అశ్వినీద్ పెద్ద నిర్మాత. తనయురాళ్లు స్వప్న, ప్రియాంక దత్ లు నిర్మాణ రంగంలో రాణిస్తున్నారు. అలాంటప్పుడు చిరును బయటకు ఎందుకు వదులుతారు.