దేశంలో ఢిల్లీ, ముంబై, గుజరాత్‌లలో కరోనా కేసులు విపరీతంగా నమోదు కావడానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో ఇండియాలో పర్యటించడమేనని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. శివసేన పత్రిక సామ్నాలో రాసిన ఓ కథనంలో ఆయన ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే లాక్‌డౌన్‌ను అమలు చేశారని, అలాగే కరోనా తగ్గకుండానే లాక్‌డౌన్‌ను ఎత్తేశారని.. ఆయన ఆరోపించారు.
ఫిబ్రవరి 24వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీలు అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనంతరం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన మొతెరా క్రికెట్ స్టేడియంలో 1 లక్ష మందికి పైగా జనాలతో ఇరు దేశాధినేతలు సమావేశం అయ్యారు. అలాగే ట్రంప్‌తో వచ్చిన ప్రతినిధులు ముంబై, ఢిల్లీల్లోని అనేక ప్రాంతాలను కూడా సందర్శించారు. అందువల్లే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోపణలు చేశారు.
ఇక ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే లాక్‌డౌన్‌ను విధించారని, అలాగే లాక్‌డౌన్ ఎత్తేసే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టడం దారుణమని అన్నారు. దీని వల్ల మరిన్ని తీవ్రమైన పరిణామాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుందన్నారు.