శతాబ్దాల సాకారమై అయోధ్యలోని నవ నిర్మిత భవ్య మందిరంలో రామయ్య కొలువు దీరాడు. ప్రధాని చేతుల మీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుక చూసి భక్త జనం పులకించిపోయింది. అయితే ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన రామ్ లల్లాను ఇక నుంచి బాలక్ రామ్ గా పిలువనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు.
జనవరి 22న ప్రతిష్టించిన శ్రీరాముడి విగ్రహానికి బాలక్ రామ్ గా పేరు పెట్టామని.. అయోధ్యలో కొలువురు దీని శ్రీరామ చంద్ర మూర్తి ఐదేళ్ల పసి బాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ పేరును నిర్ణయించాం. ఇక పై ఈ ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తాం అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నుంచి బాల రాముడి దర్శనానికి సామాన్య భక్తులకు అనుమతించారు. ప్రాణ ప్రతిష్ట పూర్తి అవ్వడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసినట్టు తెలిసింది. రోజుకు 6 సార్లు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ట్రస్ట్ కి చెందిన ఆచార్య మిథిలేశ్ నందిని శరణ్ తెలిపారు.