కర్ణాటకలో నందిని పాల ధరలు పెంపు.. ప్రతి ప్యాక్‌లో 50 ml పాలు అదనం

-

కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌  రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల  ధరలను పెంచింది. లీటరుపై రూ.2 పెంచింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేఎమ్‌ఎఫ్‌ చైర్మన్‌ భీమా నాయక్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. సవరించిన ధరలతో రూ.42గా ఉన్న లీటరు నందిని పాల ధర ఇప్పుడు రూ.44కు చేరింది. పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ధరలు పెంపుతోపాటు వినియోగదారులకు ఓ శుభవార్త కూడా చెప్పారు. ప్రతి పాల ప్యాకెట్‌లో 50 ml పాలను ఎక్కువగా అందించనున్నట్లు వెల్లడించారు. అంటే అర లీటరు ప్యాకెట్‌ 500 mlకి బదులు 550 ml అందించనున్నట్లు వివరించారు.

 

కేఎమ్‌ఎఫ్‌ నిర్ణయంతో.. టోన్‌ మిల్క్‌ రూ.42 నుంచి రూ.44కి, హోమ్‌జైన్డ్‌ టోన్‌ మిల్క్‌ రూ.43 నుంచి రూ.45కి, హోమ్‌జైన్డ్‌ ఆవు పాలు రూ.46 నుంచి రూ.48కి, స్పెషల్‌ పాలు రూ.48 నుంచి రూ.50కి, శుభం పాలు రూ.48 నుంచి రూ.50కి, సమృద్ధి రకం పాలు రూ.51 నుంచి రూ.53కి, శుభం హోమ్‌జైన్డ్‌ టోన్‌ మిల్క్‌ రూ.49 నుంచి రూ.51కి, శుభం గోల్డ్‌ మిల్క్‌ రూ.49 నుంచి రూ.51కి, శుభం డబుల్ టోన్‌ మిల్క్ రూ.41 నుంచి రూ.43కి చేరింది. కాగా, ఏడాదిలో నందిని పాల ధరలు పెరగడం ఇది రెండోసారి. కేఎమ్‌ఎఫ్‌ చివరిసారిగా జూలై 2023లో నందిని పాల ధరలను పెంచిన విషయం తెలిసింది. అప్పుడు లీటరుపై రూ.3 పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version