నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న “అంటే సుందరానికీ” సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది. సినిమా పేరు, టీజర్ జనాల్లోకి బాగా వెళ్ళాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించడం కూడా ఆ ఆసక్తికి కారణం. ఐతే ప్రస్తుతం ఈ సినిమా చిక్కుల్లో ఉంది. పెళ్ళిచూపులు, మెంటల్ మదిలో చిత్రాల నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా విషయమై నిర్మాతల సంఘానికి కంప్లైంట్ ఇచ్చాడు. నిజానికి “అంటే సుందరానికీ” చిత్రం తన నిర్మాణ సంస్థలో తెరకెక్కాలని అందుకు అనుగుణంగా వివేక్ ఆత్రేయతో ఒప్పందం జరిగిందని చెబుతున్నాడు.
ఇప్పుడు ఆ ఒప్పందాన్ని వివేక్ ఆత్రేయ ఉల్లంఘించాడని అన్నారు. వివేక్ ఆత్రేయ మొదటి సినిమా మెంటల్ మదిలో కి నిర్మాతగా వ్యవహరించిన రాజ్ కందుకూరి ఆ టైమ్ లోనే ఒప్పందం కుదుర్చుకున్నాడట. కానీ వివేక్ ఆత్రేయ తన రెండవ చిత్రం బ్రోచేవారెవరువా ని మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందించాడు. అప్పుడు తన మూడవ చిత్రాన్ని రాజ్ కందుకూరి నిర్మాణంలో తెరకెక్కిస్తానని మాటిచ్చాడట. ఇప్పుడు ఆ మాట తప్పడంతో రాజ్ కందుకూరి నిర్మాతల సంఘాన్ని ఆశ్రయించాడు. మరి ఈ వివాదం ఎప్పుడు తీరుతుందో..!