రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ములాఖత్ ద్వారా కలిశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అనవసరంగా రెచ్చగొడుతున్నారని, సింహంలాగా గర్జించే ఆయనను మీరు జైల్లో పెట్టి ఉండవచ్చు, కానీ ఒకటి మరిచిపోతున్నారని, ఇక నుంచి ప్రజల కోసం మరింత కసిగా పని చేస్తారని అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నాయకులు చేపట్టిన నిరసనదీక్షలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అన్నారు నారా భువనేశ్వరి. ప్రజల సొమ్ము కోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు.
చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి మీ కోసం మళ్లీ పని చేస్తారని ప్రజలను ఉద్ధేశించి అన్నారు. అవినీతి మరక అంటించి 17
రోజులుగా జైల్లోనే ఉంచారన్నారు. ఏం తప్పు చేశాడని జైల్లో నిర్బంధించారు? అన్నారు. ప్రజల సొమ్ము ఆయనేమీ తీసుకోలేదని, తమ కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మే వ్యక్తి ఎన్టీఆర్ నీడలో తాను పెరిగానన్నారు. తాను, తన కోడలు బ్రాహ్మణి ఏనాడూ బయటకు రాలేదని, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు.