అప్పుడే మహిళా బిల్లుకు నిజమైన విలువ ఇచ్చినట్లు : విజయశాంతి

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించింది. అయితే, ఈ బిల్లు అమల్లోకి వచ్చేందుకు సమయం పట్టనుంది. ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌ సభ ఎన్నికలకు ఈ బిల్లు వర్తించబోదు. అయితే, బీఆర్‌‌ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో పున:సమీక్ష చేసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు. అలా చేస్తే మిగతా పార్టీలపై ఒత్తిడి పెరిగి.. ప్రధాన పార్టీలన్నీ కూడా ఎక్కువ సీట్లను మహిళలకు కేటాయిస్తాయని విజయశాంతి ట్వీట్ చేశారు.

‘మోదీ ప్రభుత్వం తెచ్చిన మహిళా బిల్లు.. జనగణన, డీ లిమిటేషన్ దృష్ట్యా 2028 లేదా 2029లోనే అమలవుతుంది. కాబట్టి ఇప్పటికైతే మహిళలకు ఈ ఎన్నికలలో (2023/24) సీట్లు ఇయ్యనవసరం లేదు అని రాజకీయ పార్టీలు అనుకోకుండా ఇప్పటినుండి రానున్న ప్రతి ఎన్నికల్లోనూ ఆ మహిళా ప్రాధాన్యతా ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంత వరకు తమ వైపు నుంచి చూపి నిజాయతీని నిరూపించుకుంటే, మహిళా బిల్లుకు నిజమైన విలువ ఇచ్చినట్లు సమాజం అభిప్రాయపడతది. తెలంగాణలో ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ సీట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్, అందులో కేవలం 6 స్థానాలు మహిళలకు ఇవ్వడం చూస్తే మహిళా రిజర్వేషన్ పై గొంతుపెట్టి, మోసపూరితంగా అరుస్తోందన్న అనుమానం తెలంగాణ మహిళలకు కలగదు. నిజంగా మహిళా రిజర్వేషన్ పై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తన చిత్తశుద్ధిని ప్రకటించాలనుకుంటే సీట్ల కేటాయింపు విషయంలో పున:సమీక్ష చేయాలి. అలా చేయగలితే అప్పుడు అధికార పార్టీ నిర్ణయంతో తెలంగాణలోని ప్రతిపక్షాలపై ఒత్తిడి పెరిగి, ప్రధాన పార్టీలన్నీ కూడా అధిక శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సిన నిర్భంధం ఏర్పడుతుంది. ప్రధాని మోదీ గారు తెచ్చిన మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల కార్యాచరణ ఇప్పటి నుండి ప్రారంభమై సార్థకత లభిస్తుంది’ అని విజయశాంతి ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version