నీ బంధువు,నీ జైలుమేట్ కంపెనీ తయారు చేసే రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ జనాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కోవిడ్ చికిత్సకు పనికిరాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చిచెప్పిన రెమ్‌డెసివర్ ఇంజక్షన్ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టారు అని అన్నారు. సీబీఐ,ఈడీ కేసుల భయంతో ప్రధాని ని వ్యాక్సిన్ కోటా అడగలేక చంద్రబాబు గారి పై ఏడుస్తావెందుకు జగన్ రెడ్డి? అని నిలదీశారు.
వ్యాక్సిన్ కి డబ్బు ఇవ్వకుండా కోవాగ్జిన్ చంద్రబాబు గారి బంధువులదని మళ్లీ నంగి నాటకాలెందుకు? అని ప్రశ్నించారు. కోవిషీల్డ్ కొనుగోలుకీ చంద్రబాబు గారు అడ్డంపడ్డారా? అని ప్రశ్నించారు. 2 కంపెనీలు కమీషన్ ఇవ్వను అన్నాయా? నీ దొంగ బంధువుల కంపెనీ వ్యాక్సిన్ తయారుచేసే వరకూ ప్రజల్ని చంపేస్తావా? అని ప్రశ్నించారు. నీ నిస్సహాయత దేశమంతా తెలిసి పక్క రాష్ట్రాలు ఏపీ అంబులెన్స్ లనూ కూడా రానివ్వట్లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికైనా కుళ్లు కుల రాజకీయం మాని వ్యాక్సినేషన్ ప్రక్రియ పై దృష్టి పెట్టాలి అని సూచించారు.