సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి కంటే ఉత్తరకొరియా కిమ్ నయమంటూ చురకలు అంటించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ని అడ్డుకుని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడమే విద్యార్థిసంఘాల నేతలు చేసిన భయంకరమైన నేరమన్నట్టు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించదని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రజా, విద్యార్థిసంఘాలని అక్రమంగా అరెస్ట్ చేయిస్తారని… రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపేహక్కుని హత్యచేస్తోన్న జగన్ రెడ్డి కంటే ఉత్తరకొరియా కిమ్ నయమంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని… కనీసం వారిని మనుషుల్లా కూడా చూడకుండా ప్రభుత్వ పెద్దలు అవమానిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. ఆఖరికి ఉద్యోగులు దాచుకున్న రూ.1600 కోట్లను ప్రభుత్వం ఇవ్వక పోవటం దారుణమని ఫైర్ అయ్యారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసి అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ”ఇచ్చిన హామీ ప్రకారం తాత్సారం చెయ్యకుండా సిపిఎస్ రద్దు చెయ్యాలి. రూ.1600 కోట్లు వెంటనే విడుదల చెయ్యాలి. పెండింగ్లో పెట్టిన 7 డిఏలు వెంటనే ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.” అని డిమాండ్ చేశారు.