చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి నారా లోకేష్ లేఖ రాశారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి భేటీలో వెనక్కి తీసుకోవాలని.. కరోనా దెబ్బతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. నేత కళాకారులని గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని.. ఏపీలో వైసీపీ ప్రభుత్వ చిన్నచూపు, కరోనా కారణంగా చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో ఉందని వెల్లడించారు.
అసలుకే ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలకు జీఎస్టీ పెంపు శరాఘాతంగా మారిందని.. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడమే పెనుభారమైతే ఇప్పుడు ఏకంగా దానిని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత రంగానికి మరణశాసనమేనని పేర్కొన్నారు.
ముడిసరుకులపైనా 25శాతం మేర పన్ను పెంచారని.. జీఎస్టీ పెంపు నిర్ణయంతో చేనేత పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ పెంపుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయన్నారు.