ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.కమలా మిల్స్ కాంపౌండ్ ఏరియాలోని 15 అంతస్తుల టైమ్స్ టవర్ బిల్డింగులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. 8 ఫైరింజన్ల సాయంతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, 15వ అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం జరిగినా ఫైర్ సేఫ్టీపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అంత పెద్ద భవనంలో అలారమ్ ఎందుకు మోగలేదు. అసలు మోగిందా? లేదా సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు త్వరగా రెస్పాండ్ కాలేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.కాగా, కమలా మిల్స్ ఏరియాలోని ఓ రెస్టారెంట్లో 2017 డిసెంబర్ 29న జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.