కేరళ వయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటివరకు 93 మంది మరణించారు. పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇక్క ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలు అంతరాయం ఏర్పడుతోంది. ఈ ఘటనలో సహాయక చర్యలు సాగుతున్న కొద్ది ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా వయనాడ్ లో 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతయినట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికంగా మొబైల్ నెట్ వర్క్ కూడా దెబ్బతినడం వల్ల సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ముండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి ఇక్కడి హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా ముండకైలోనే నివాసం ఉంటుండగా.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తమ కార్మికుల్లో ఒక్కరిని కూడా సంప్రదించలేకపోయామని తాజాగా ఆ కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ చెప్పడంతో అధికారులు షాక్ తిన్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.