ప్రేమకు వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రేమకు ఆకర్షితులు అవుతారు. ఎవరైనా మనపై ప్రేమను చూపించారంటే వారి వైపుకు వెళ్ళిపోతారు. ఇక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అత్యంత పవిత్రమైనది. చాలామంది స్త్రీ, పురుషులు నేటి కాలంలో ప్రేమ వివాహాలు చేసుకోవడం చాలా సహజం అయిపోయింది. ప్రేమించుకుని వివాహం చేసుకుంటే పెద్దలు సైతం అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రేమ జంట 70 ఏళ్లు పైబడిన తర్వాత వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఈ జంట.

కేరళకు చెందిన ఓ వృద్ధ జంట రామవర్మపురం లోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్. బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు. వీరిద్దరి ప్రేమకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. ఒకరికొకరు సంతోషంగా తోడు ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.