స్వాతంత్య్రానంతరం జరిగిన అతి పెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్లను ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగానే సమర్థించారని ఆమ్ ఆద్మీ పార్టీ- ఆప్ ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యాలను కూడా ప్రధాని అవమానించారని మండిపడింది.
మోదీ సుప్రీం కోర్టుకు, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్… దేశానికి, దిల్లీ ప్రజలకు ఒక కొడుకు, అన్నలాగా సేవ చేశారని అలాంటి వ్యక్తిని జైలు పాలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్‌పై ఎంత ద్వేషముందో అర్థమవుతోందని అన్నారు.
ఎన్నికల బాండ్ల విధానంపై నిజాయతీగా ఆలోచిస్తే.. వాటి రద్దు గురించి ప్రతి ఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తాయన్న మోదీ.. నల్లధనాన్ని అరికట్టేందుకు తన మనసుకు వచ్చిన స్పచ్ఛమైన ఆలోచనే ఎన్నికల బాండ్లని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై తాజాగా ఆప్ స్పందించింది.