దిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టవ్వడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. సీఎం పదవిలో ఉండగా అరెస్టయిన తొలి నేతగా కేజ్రీవాల్ నిలిచారు. అయితే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. ఈ విషయాన్ని దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇవాళ ఉదయం కేజ్రీవాల్ నివాసానికి మంత్రి వెళ్లగా తనను లోనికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు చెప్పారు.
దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఎం అరెస్టయ్యారని, ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులున్నారని, వారందరినీ కలిసి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు తమను లోపలికి అనుమతించట్లేదని మండిపడ్డారు. ఏ చట్టం కింద వారిని గృహ నిర్బంధంలో ఉంచారు? తప్పుడు కేసులో సీఎంను శిక్షిస్తున్నారు సరే.. ఆయన వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలపై కేంద్రానికి ఎందుకింత కక్ష?’’ అని గోపాల్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.