కేంద్రం కొత్త రూల్.. ఇక నుంచి లారీ క్యాబిన్ లో ఏసీ తప్పనిసరి

-

కేంద్ర రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు భద్రతకు సంబంధించి N2, N3 కేటగిరీలకు చెందిన ట్రక్కుల క్యాబిన్‌లలో ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్‌(ఏసీ)లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. త్వరలోనే ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి అవుతుందని తెలిపారు. N2 కేటగిరీ కింద ఉండే సరకు రవాణా వాహనాల బరువు 3.5 టన్నుల నుంచి 12 టన్నుల మధ్యలో ఉంటుంది. N3 కేటగిరీలో సరకు రవాణా వాహనాల బరువు 12 టన్నులకు పైగా ఉంటుంది.

‘రోడ్డు భద్రతలో ట్రక్కు డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తారు. వారికి సౌకర్యవంతమైన పరిస్థితులు కల్పించడానికి ఈ నిర్ణయం ముఖ్యమైన మైలురాయి. ఇది డ్రైవర్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. డ్రైవర్ అలసట సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది’ అని ట్వీట్ చేశారు. ట్రక్కుల్లో ఎయిర్‌ కండిషన్‌ నిబంధనను తీసుకురానున్న విషయాన్ని గత నెల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ప్రస్తావించారు. 2025 నాటికి అన్ని ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లు తీసుకురావాలని అనుకుంటున్నట్లు గడ్కరీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version