జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజీత్ డోభాల్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి నియమించింది. ‘ఎన్‌ఎస్‌ఏ’గా ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ గురువారం రోజున ఆమోద ముద్ర వేసింది. పదవీకాలంలో ఆయన క్యాబినెట్ మంత్రి హోదాతో వ్యవహరిస్తారని పేర్కొంది.
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారి అధికారంలో వచ్చిన సమయంలో 2014 మే 30న డోభాల్ తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.కె.మిశ్రను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను కేటాయించారు. ఈ నెల 10 నుంచి మొదలుకొని ప్రధాని మోదీ పదవీకాలం పూర్తయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు డోభాల్ ఎన్‌ఎస్‌ఏగా ఉంటారని, పి.కె.మిశ్ర ప్రధాని ముఖ్యకార్యదర్శిగా ఉంటారని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ పేర్కొంది.