దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులకు మద్దతుగా పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అభ్యర్థుల కుటుంబ సభ్యులే స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పోటాపోటీగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల పోరులో రాజకీయ యోధుడు ములాయంసింగ్ యాదవ్ కుటుంబంలోని మూడో తరం ప్రచారానికి దిగింది.
మైన్‌పురీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌కు మద్దతుగా వారి కుమార్తె ఆదితి యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లండన్‌లో చదువుకొంటూ సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆదితి తన తల్లికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఉన్న రాజకీయ మేధస్సు, పరిస్థితులపై అవగాహన చూసి పలువురు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం మైన్‌పురీ ఎంపీగా ఉన్న డింపుల్ గెలుపు ఈసారి అంత సులభం కాదన్న విశ్లేషణల నేపథ్యంలో ఆదితి తన ప్రసంగాల్లో బీజేపీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.