అస్సాంలోని కామాఖ్యా ఆలయంలో వార్షిక అంబుబాచి మేళా ఇవాళ ప్రారంభమైంది. నీలచల కొండపై ఉన్న శక్తి పీఠం కామాఖ్యా ఆలయాన్ని నేటి నుంచి నాలుగు రోజుల పాటు మూసివేయనున్నారు. అమ్మవారి వార్షిక నెలసరి సందర్భంగా ఆలయ ద్వారాలను మూసివేసి మళ్లీ నాలుగు రోజుల తర్వాత తెరవనున్నారు. అంబుబాచి మేళా కోసం లక్షలాది మంది భక్తులు గౌహతి చేరుకున్నారు. ఆలయ ద్వారా తెరిచిన తర్వాత పూజలు నిర్వహించేందుకు వారంతా వేచి చూస్తారు.
ఇవాళ ఉదయం 8.43 నిమిషాలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. దీంతో ప్రభృత్తి మొదలైనట్లు తెలిపారు. మళ్లీ జూన్ 25వ తేదీన రాత్రి 9.07 నిమిషాలకు నిబృత్తి ద్వారా ఆలయ ద్వారాలను తెరవనున్నారు. మంగళరకమైన స్నానం తర్వాత ఆలయంలో దర్శనాలు ప్రారంభం అవుతాయి. మేళాకు వస్తున్న భక్తులకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. సాధువులు, భక్తులకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు ఆయన తన ఎక్స్ పోస్టులో తెలిపారు. మేళాను సజావుగా నిర్వహించేందుకు కామరూప మెట్రోపాలిటన్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.