ఆయన మోడ్రన్ ఆర్కిటెక్ట్.. జైశంకర్​పై అమెరికా ప్రశంసల జల్లు

-

భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు చంద్రయాన్ వలే దూసుకెళ్తున్నాయని తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంతలాబలపడటానికి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ముఖ్య కారణమని అమెరికా తాజాగా పేర్కొంది. భారత రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా స్టేట్ ఫర్‌ మేనేజ్‌మెంట్ అండ్‌ రిసోర్స్ డిప్యూటీ సెక్రటరీ రిచర్డ్‌ వర్మ జైశంకర్​పై ప్రశంసల వర్షం కురిపించారు.

భారత్‌-అమెరికా మైత్రి ఈ దశాబ్దపు ముఖ్యమైన బంధాల్లో ఒకటని రిచర్డ్ వర్మ అన్నారు. ఇరు దేశాల మధ్య భేదాప్రాయాలు ఉన్నా.. అవి రోడ్డు ప్రయాణాల్లో వచ్చే ఎత్తు పల్లాలు వంటివి మాత్రమేనని పేర్కొన్నారు. భారత్-అమెరికా దేశాల మధ్య కొత్త పుంతలు తొక్కుతున్న సంబంధాలకు జైశంకర్‌ ఆధునిక రూపకర్త అని రిచర్డ్ అభివర్ణించారు. భారత్‌-అమెరికాల మధ్య బలమైన బంధం ఏర్పడటానికి శ్రమించే తత్వమున్న భారతీయ అమెరికన్లు ప్రధాన కారణమని తెలిపారు. మహాత్మాగాంధీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వంటి గొప్ప వ్యక్తుల ఆలోచనలతో ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా మారాయని.. ఈ మైత్రి మరింత బలపడటానికి గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేసి, ప్రస్తుతం కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్‌. జైశంకర్‌ ముఖ్య కారణమని పునరుద్ఘాటించారు. జైశంకర్ ఓ మోడ్రన్ ఆర్కిటెక్ట్ అని రిచర్డ్ అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version