స్కిల్ డెవలప్మెంట్ సంస్థ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ టీడీపీ శ్రేణులు నిరసన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలో ఓవైపు నందమూరి కుటుంబం, మరోవైపు నారా ఫ్యామిలీ పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ దీక్షలో ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి శ్రీనివాస్, చలసాని చాముండేశ్వరి, నారా రోహిత్ తల్లి ఇందిర, తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డి, నందమూరి జయశ్రీ, సుధ, శిల్ప, దీక్షిత, రాహుల్, తారకరత్న కుమార్తె నిష్క తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు పలికారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.
మరోవైపు ఎన్టీఆర్ ఘాట్‌లో దీక్ష చేపట్టిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా సుహాసిని డిమాండ్ చేశారు.