ప్రసవం సమయంలో మహిళ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. మరీ ముఖ్యంగా ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలకు డాక్టర్లు సకాలంలో స్పందించి వైద్యం అందించడం ద్వారా తల్లి, బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేకుండా వారిని కాపాడొచ్చు. కానీ ఓ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. త్వరలోనే చంటి పిల్లలతో ఆడుకుంటామని మురిసిపోయిన కుటుంబంలో చీకట్లు కమ్ముకునేలా చేసింది. అసలు విషయంలోకి వెళితే.. ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోమ్ లో చేర్పించారు. ఆమెకు తీవ్రంగా నొప్పులు రావడంతో వైద్యులు త్వరగా ప్రసవరే చేయాలని ఆమెను ఆపరేషన్ చేసే రూమ్కు షిఫ్ట్ చేశారు. అప్పటికీ ఆస్పత్రిలో కరెంట్ పోయింది. దీంతో కరెంట్ కోసం ఇతర ఏర్పాట్లు చేయకుండా, టార్చ్ లైట్ వేసి వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి, తల్లీబిడ్డ మృతి చెందారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన ముంబైలో సంచలనంగా మారింది.