సింహాలకు అక్బర్‌, సీత అని పేర్లు పెట్టిన అధికారి సస్పెండ్

-

పశ్చిమ బెంగాల్లోని శిలిగుడి సఫారీ పార్కులో మగ, ఆడ సింహాలకు అక్బర్‌, సీత పేర్లు పెట్టి, ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసింది. వాటికి ఆ పేర్లు పెట్టడంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాస్తా దుమారం రేపడంతో సింహాలకు ఆ పేర్లు పెట్టిన అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

జంతువుల మార్పిడి కార్యక్రమం కింద బెంగాల్‌ అధికారులు ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజలా జూ పార్క్‌ నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. ‘అక్బర్‌’, ‘సీత’ పేర్లు కలిగిన ఆ మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంతో విశ్వహిందూ పరిషత్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వాటికి పేర్లు పెట్టారని, వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. సింహాలకు ఆ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ వాటికి వేరే పేర్లు పెట్టాలని ఆదేశించింది. దీనిపై బెంగాల్‌ ప్రభుత్వం స్పందిస్తూ త్రిపుర నుంచి తీసుకొచ్చేటప్పటికే వాటికి ఆ పేర్లు ఉన్నాయని, వాటిని మారుస్తామని కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారం వివాదాస్పదమవడంతో త్రిపుర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బెంగాల్‌కు అప్పగించే సమయంలో డిస్పాచ్‌ రిజిస్టర్‌లో ఆ సింహాల పేర్లను అక్బర్‌, సీతగా నమోదు చేసిన త్రిపుర రాష్ట్ర అటవీ వ్యవహారాల ప్రిన్సిపల్ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రబిన్‌ లాల్‌ అగర్వాల్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version