దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని, కానీ అధికార బీజేపీ మాత్రం ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
ముంబైలో శనివారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ముంబైలో కాంగ్రెస్ బలపడితేనే జాతీయ స్థాయిలో పటిష్టంగా ఉండగలదని తెలిపారు. ‘కాంగ్రెస్ ని బలోపేతం చేయడం ప్రతి పార్టీ కార్యకర్త బాధ్యత. ముంబై, కాంగ్రెస్కు ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే పార్టీకి పునాది పడింది ముంబైలోనే. అంతేగాక ఉపాధి హామీ పథకం వంటి అనేక నిర్ణయాలు రూపొందించబడ్డాయి’ అని తెలిపారు. దేశం కోసం ఏమి చేశారో రాబోయే తరానికి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని వెల్లడించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశంలో ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తు చేశారు. మౌలిక సదుపాయాలు, టెలికాం రంగం తదితర అంశాల్లో దేశ పురోగతి, అభివృద్ధికి పార్టీ కీలకపాత్ర పోషించిందన్నారు. కానీ దేశ ప్రగతికి సంబంధించిన క్రెడిట్ కొట్టేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, 1989 నుంచి గాంధీ కుటుంబంలోని ఏ ఒక్కరు కూడా మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రధానిగా అధికారంలో లేరని తెలిపారు.