మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే తరహా అమానవీయ ఘటన పశ్చిమ బెంగాల్‌లో కూడా చోటు చేసుకుందని హుగ్లీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ అన్నారు. మణిపుర్ ఘటనపై మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. జులై 8న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మహిళా అభ్యర్థిని కూడా వివస్త్రను చేసి, ఆమె పట్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అమానవీయంగా వ్యవహరించారని చెప్పారు. ఇదో మణిపుర్ తరహా ఘటన అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
మణిపుర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కానీ.. పశ్చిమ బెంగాల్ కూడా ఈ దేశంలో భాగమనని.. ఆ రాష్ట్రంలో మహిళకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడాలని కోరుతున్నామని ఛటర్జీ అన్నారు. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ మహిళా అభ్యర్థి పట్ల వ్యవహిరించిన తీరు అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు. రెండింటి మధ్య వ్యత్యాసం ఒక్కటేనని.. మణిపుర్ ఘటనలో వీడియో ఆధారం ఉందని.. పశ్చిమ బెంగాల్ ఘటనలో వీడియో ఆధారం లేదని చెప్పారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా టీఎంసీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.