‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. ఎంపీకి బీజేపీ షోకాజ్‌ నోటీసులు

-

కేంద్ర మాజీ మంత్రి, తమ పార్టీ ఎంపీ జయంత్‌ సిన్హా తీరుపై బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాజా ఎన్నికల్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోలేదు. దీంతో ఆగ్రహించిన పార్టీ అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. జయంత్ సిన్హాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

‘‘హజారీబాగ్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థిగా మనీశ్ జైస్వాల్‌ను ప్రకటించినప్పటి నుంచి మీరు పార్టీ సంస్థాగత కార్యాచరణ, ఎన్నికల ప్రచారంపై ఆసక్తి కనబర్చడం లేదు. కనీసం ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా మీరు గుర్తించలేదు. మీ ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింది. దీనిపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలి.’’ అని బీజేపీ ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే, ఈ నోటీసులపై సిన్హా ఇంకా స్పందించలేదు.

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న జయంత్‌ సిన్హా ఈ సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సంస్థాగత వ్యవహారాలకు కూడా సిన్హా దూరంగా ఉన్నారు. హజారీబాగ్‌ స్థానానికి ఐదో విడతలో భాగంగా సోమవారం పోలింగ్‌ జరిగింది. ఇందులో ఆయన ఓటు వేయకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version