దేశ రాజధాని నగరం దిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇప్పటికే పలుమార్లు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హస్తినలో మరో ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టిస్తోంది. పుష్పవిహార్ ప్రాంతంలోని అమృత పాఠశాలకు ఇవాళ ఉదయం 6.35 గంటల సమయంలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు.
దీనిపై అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆ తర్వాత పాఠశాలను ఖాళీ చేయించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఇటీవల ఈ తరహాలో దిల్లీలోని పాఠశాలలకు తరచూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. సుమారు నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన. ఏప్రిల్‌లో మథురా రోడ్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, సాదిఖ్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు ఇలాగే మెయిల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.