రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్కు బీజేపీ షాక్ ఇచ్చింది. ఆయనకు టికెట్ నిరాకరించిన పార్టీ ఆ స్థానంలో ఆయన కుమారుడిని బరిలోకి దింపింది. ఉత్తర్ప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ స్థానం నుంచి కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయ్బరేలీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది.
కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో గెలుపొందారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేయడంతో.. అప్పటి నుంచి బ్రిజ్‌భూషణ్ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగిన ఆయన క్రీడారాజకీయాలకు గుడ్ బై చెప్పారు. జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవవ్వడంతో తాజా ఎన్నికల్లో ఆయన్ను పార్టీ హై కమాండ్ పక్కన బెట్టింది.