దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. 18-44 ఏళ్ల వయస్సు వారికి మే 1 నుంచి వ్యాక్సిన్లను ఇవ్వాలని నిర్ణయించినా అనేక రాష్ట్రాల్లో టీకాల కొరత కారణంగా ఆ గ్రూపు వారికి ఇప్పుడే టీకాలను ఇవ్వలేమని రాష్ట్రాలు చేతులెత్తేశాయి. అయితే కోవిడ్ టీకాలకు గాను సింగిల్ డోసు తీసుకుంటే వైరస్ నుంచి రక్షణ లభిస్తుందా, లేదా ? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే…
మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్న విషయం విదితమే. మే 1వ తేదీన దేశానికి రష్యాకు చెందిన స్పుత్‌నిక్-వి టీకాలు కూడా వచ్చేశాయి. వీటిని కూడా త్వరలో ఇవ్వనున్నారు. అయితే ఏ టీకా అయినా సరే రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. కానీ ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌లకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్లు ఒక్క డోసు తీసుకుంటే కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
అంటే కోవిడ్ టీకాలు ఒక్క డోసు తీసుకుంటే వైరస్ నుంచి దాదాపుగా 50 శాతం వరకు రక్షణ లభిస్తుందన్నమాట. కానీ ఇది వ్యక్తిని బట్టి మారుతుందని సైంటిస్టులు తెలిపారు. అందరిలోనూ ఒకేలా ఉండదని, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కోవిడ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అలాంటి వారు టీకాలను ఒక్క డోసు తీసుకుంటే కోవిడ్ నుంచి 50 శాతం వరకు రక్షణ లభిస్తుందని, మిగిలిన వారి విషయంలో చెప్పలేమని సైంటిస్టులు తెలిపారు. అయినప్పటికీ కోవిడ్ టీకాలను రెండు డోసులుగా తీసుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.