సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తమ నియంత్రణలో లేదని అధికార మోడీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండానే సీబీఐ పశ్చిమ బెంగాల్లో కేసులు నమోదు చేసి దర్యాప్తులు చేస్తుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం.. కేంద్రంపై సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై స్పందించిన కేంద్రం సీబీఐ తమ నియంత్రణలో లేదని స్పష్టం చేసింది.
కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ముందు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కేసులను సీబీఐ నమోదు చేసిందని, సీబీఐ మా నియంత్రణలో లేదని అన్నారు. ఇటీవల సందేశా ఖాలీలో భూకబ్జాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తులు చేస్తుంది. అయితే ఈ దర్యాప్తుల గురించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేదని టీఎంసీ ప్రభుత్వ ఆరోపణ. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్రంపై పిటిషన్ దాఖలు చేయగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విధమైన ప్రకటన చేశారు.