జూన్ నెల చివరి వారం రాబోతున్నా భారత్‌లో ఇంకా ఎండ వేడిమి తగ్గలేదు. తగ్గకపోగా.. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ తీవ్ర వడగాలులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ నైరుతి రుతుపవనాల జాడే లేదు. రైతులు వరినాట్లు వేసేందుకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వడగాలులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్యశాఖ సంసిద్ధతను సమీక్షించేందుకు ఇవాళ ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. బిహార్‌లోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. వడదెబ్బ కారణంగా సోమవారం నాటికి ఆ రాష్ట్రంలో 81 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బలియా ఆసుపత్రిలో మిస్టరీ మరణాలు కొనసాగుతున్నాయి. ఇవి వడదెబ్బ మరణాలే అనివైద్యాధికారులు చెబుతున్నారు. దీంతోపాటు పలు కారణాలున్నాయని అంటున్నారు.
తెలుగురాష్ట్రాల్లో ప్రజలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం కూడా తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగింది. పలుచోట్ల సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.