భారత్ లో ఇటీవల ఆన్ లైన్ స్కామ్ లు, హనీ ట్రాప్ లు, ఆన్ లైన్ వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఆన్ లైన్ స్కామర్లు రోజుకో తరహా మోసంతో అమాయకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే.. బెదిరింపులకు పాల్పడి వారు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. ఈ మధ్య డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనియల్ స్కామ్ లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో చిక్కుకుని యువత కొన్నిసార్లు డబ్బు.. మరికొన్ని సార్లు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆయా యాప్ యూజర్లను హెచ్చరించింది. ఆన్‌లైన్ డేటింగ్\రొమాన్స్ స్కామ్‌ల్లో బాధితులు సగటున రూ. 7996 కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యక్తిగత ఖాతాలకు సంబంధించి భారత కస్టమ్స్ అధికారులు ఎవరూ ఎస్ఎంఎస్‌లు పంపడం, కాల్స్ చేయడం వంటివి చేయరని మ్యాట్రిమోనియల్, డేటింగ్ స్కామ్స్ గురించి అవగాహన కల్పిస్తూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్ లవర్స్ అందించే ఖరీదైన గిఫ్ట్‌ల వలలో పడవద్దని హెచ్చరించింది.