టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2047కు వికసిత భారత్ లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారన్న చంద్రబాబు.. మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే మన దేశం కీలకపాత్ర పోషించనుందని వ్యాఖ్యానించారు.
వారణాసి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే వారణాసి ప్రజలను ఉద్దేశించి తాజాగా మోదీ ఓ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోటులో గంగానదీ విహారం చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు.