చంద్రయాన్-3 “ల్యాండింగ్”పై ఇప్పుడు ప్రపంచం అంతా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్, చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ పూర్తి ప్రక్రియ 20 నిమిషాల పాటు ఉంటుంది. ఇది సక్సెస్ అయితే ఇండియా చరిత్ర సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండింగ్ సమయంలో ఏం జరుగుతుందో వివరంగా చూద్దాం..
ఆ 20 నిమిషాలే చాలా కీలకం..
ఈ 20 నిమిషాల కీలక సమయాన్ని టీ-20 (టెర్రర్-20) అని పిలుస్తున్నారు. 25 కి.మీల ఎత్తు నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతూ వస్తుంది. ఆ సమయంలో రెండు ఇంజిన్లు ఫైర్ అవుతుండగా ల్యాండర్ స్పీడ్ 6048కేఎంపీహెచ్గా ఉంటుంది. ఆకాశంలో తిరిగే విమానం స్పీడ్ కన్నా ఇది 10 రెట్లు ఎక్కువ ఉంటుంది.
చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న క్రమంలో ల్యాండర్ స్పీడ్ తగ్గుతుంది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్, చంద్రుడి సర్ఫేస్కు అడ్డంగా ఉంటుంది. ఈ దశను “రఫ్ బ్రేకింగ్ ఫేజ్” అంటారు. మొత్తం 20 నిమిషాల ప్రక్రియలో ఇదే 11 నిమిషాలు ఉంటుంది. అక్కడి నుంచి ల్యాండర్ను ఉపరితలానికి వర్టికల్గా మారుస్తారు శాస్త్రవేత్తలు. ఇక్కడి నుంచి “ఫైన్ బ్రేకింగ్ ఫేజ్” మొదలవుతుందట.
ఈ దశలోనే చంద్రయాన్ 2 విఫలమైంది..
ఫైన్ బ్రేకింగ్ దశలోనే చంద్రయాన్-2 మిషన్ విఫలమైందని చెప్పుకోవాలి. ల్యాండర్ను అదుపు చేయడం కష్టంగా మారడంతో, అది చంద్రుడిపై కూలిపోయింది. ఈసారి అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇస్రో అంటోంది. చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ వేగం దాదాపు సున్నాకు చేరుకుంటుంది. ఆ తర్వాత ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుంది. అప్పటికి కూడా రెండు ఇంజిన్లు ఫైర్ అవుతూనే ఉంటాయి. వాటి సాయంతోనే చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టేందుకు విక్రమ్ ప్రయత్నిస్తుంది. ల్యాండర్ కాళ్లల్లోని సెన్సార్లు ఉపరితలంపై దిగినప్పుడు.. ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. అలా 20 నిమిషాల ప్రక్రియ పూర్తవుతుంది.
ల్యాండింగ్ తర్వాత ఏం జరుగుతుందంటే
ల్యాండింగ్ ప్రక్రియ కారణంగా ఉపరితలంపై దుమ్ము ఎగిసిపడుతుంది. ఈ దుమ్మును రెగోలిథ్ అని పిలుస్తున్నారు. ఇది సెటిల్ అయిన తర్వాత, కొంతసేపటికి ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకి వస్తుంది. ఈ ప్రగ్యాన్ రోవర్.. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టి, దాదాపు 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. అయితే ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ కొన్ని ఫొటోలు పంపుతుంది. వీటిని సక్సెస్ ట్రోఫీగా పరిగణించవచ్చు. ఈ విధంగా.. అన్ని సజావుగా సాగితే.. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రలో భారత్ నిలిచిపోనుంది.