భారత్లో కరోనా మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత రెండేళ్లుగా కాస్త శాంతించిన ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్క రోజే 341 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 292 ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదైనట్లు వెల్లడించింది. ఈ క్రమంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 2041 చేరినట్లు పేర్కొంది.
కేరళలో కొవిడ్ వేగంగా వ్యాపిస్తున్నందున కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు.కరోనా లక్షణాలతో వచ్చిన వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపాలని వైద్యులకు చెప్పారు. కొవిడ్ పరీక్షలను పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తికి మాత్రమే కొవిడ్ ఉపరకం జె.ఎన్.1 ఒమిక్రాన్ సోకిందని, అతడు కోలుకున్నాడని వివరించారు. మరోవైపు తెలంగాణలో కేవలం మంగళవారం ఒక్కరోజే నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.