పాకిస్థాన్ ఆర్థిక కష్టాలకు కారణం పాకిస్థానే తప్ప భారత దేశమో, అమెరికానో కారణం కాదని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. ‘మన కాళ్లను మనమే కాల్చుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. పాక్‌లోని పాలనను శాసిస్తున్న సైనిక వ్యవస్థపై ఆయన తాజాగా పరోక్ష విమర్శలు చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ (పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్)) తరఫున టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఎదుర్కొంటున్న దుస్థితికి భారత్, అమెరికా కారణం కాదని.. అఫ్గానిస్థాన్‌లో అనిశ్చితీ కాదని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో పాక్ ప్రజలపై బలవంతపు ప్రభుత్వాన్ని రుద్దారని, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు ఆర్థిక వ్యవస్థ దిగజారిందని విమర్శించారు. ఇప్పటికే మూడు సార్లు పాక్ ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ నాలుగో సారి అధికారం సాధించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 1993, 1999, 2017 సంవత్సరాల్లో ఆయన పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.