కరోనా వ్యాప్తి ప్రారంభం అయిన కొత్తల్లో దాని గురించి సైంటిస్టులకే పూర్తిగా తెలియలేదు. దీంతో భిన్న రకాల వాతావరణ పరిస్థితుల్లో కోవిడ్ ఎలా జీవించి ఉండగలుగుతుంది ? అనే విషయంపై ఎవరికీ స్పష్టత ఉండేది కాదు. అయితే ఐఐటీ బాంబేకు చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు.
కోవిడ్ 19 గ్లాస్ మీద 4 రోజులు, ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ మీద 7 రోజుల వరకు జీవించి ఉంటుందని ఆ సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే పేపర్ మీద ఆ వైరస్ 3 గంటల పాటు ఉంటుందని, క్లాత్ అయితే 2 రోజుల వరకు ఉంటుందని తేల్చారు. కానీ ఆయా ఉపరితలాల మీద ద్రవ రూపంలో ఉండే తుంపర్లు కొంత సేపే ఉంటాయి కనుక ఆ తుంపర్లు పడిన తరువాత కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే వైరస్ యాక్టివ్‌గా ఉంటుందని, తరువాత అంత ప్రభావం ఉండదని తెలిపారు.
కానీ హాస్పిటళ్లలో, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో గ్లాస్, ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్, క్లాత్ వంటి ఉపరితలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉంటుందని, దీంతో కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని సైంటిస్టులు తెలిపారు. ఇక సైంటిస్టుల పరిశోధనల తాలూకు వివరాలను ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.