నైరుతి రుతుపవానలు ఈ ఏడాది మరింత ఆలస్యం అవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతోంది. దీనివల్లే ఇంకా రుతుపవనాలు భారత తీరాన్ని తాకలేదు. ప్రస్తుతం లక్షదీవులను ఇప్పటికీ దాటని రుతుపవనాలు అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో త్వరలోనే కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. జూన్ 8 లేదా 9వ తేదీన నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో జూన్ 15వ తేదీ వరకు వర్షాలు పడకపోవచ్చని అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయిదు శాతం వరకూ వర్షపాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈనెల 9వ తేదీ వరకు వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వాయవ్యం దిశగా ఈ అల్పపీడనం పయనిస్తున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది.