నేడు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3°C, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9°C, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7°C, అల్లూరి జిల్లా కొండైగూడెం,తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C – 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.