కేంద్రంలో మోదీ సర్కార్ను ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఈ కూటమి పీఎం అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ప్రకటించుకున్నాయి. మరోవైపు సీట్ల పంపకంపై చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా బహిర్గతమైన విభేదాలు కూటమి చీలికకు దారి తీయనున్నట్లు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన-యూబీటీ, ఎన్సీపీల మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు బెంగాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. టీఎంసీతో పొత్తు అవసరం లేదని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్కు ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. తాము సీఎం మమతా బెనర్జీతో కలిసి పని చేయాలనుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే ఆమెకు సమయం సరిపోతోందంటూ అధీర్ రంజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీట్ల పంపిణీ విషయంలో మమతా బెనర్జీని ఎవరు విశ్వసిస్తారని వ్యాఖ్యానించారు.