ఇండియాలో అమెరికా డిప్యూటీ రాయబారి (ఛార్జ్ డే అఫైర్స్)గా సీనియర్ విదేశాంగ శాఖ అధికారిణి ఎలిజిబెత్ జోన్స్‌ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 74 ఏళ్ల జోన్స్ ఇటీవల వరకు ఆఫ్గానిస్థాన్ పునరావాస కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆమె త్వరలోనే దిల్లీకి చేరుకోనున్నారు. ప్రస్తుతం పాట్రికా లాసినా న్యూదిల్లీలో ఈ స్థానంలో ఉన్నారు.
ప్రపంచ వేదికలపై భారత్‌తో నిర్మాణాత్మక ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి జోన్స్ నియామకం చేపట్టినట్లు విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. జోన్స్ గతంలో ఐరోపా-యూరేషియాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేశారు. ‘మా రాయబారి జోన్స్ త్వరలోనే ఎంబసీ, కాన్సూలేట్ ఇంటర్‌ఏజెన్సీ బృందంలో చేరనున్నారు. మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పిన ప్రపంచంలోనే అత్యంత కీలక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు’’ అని అమెరికా విదేశాంగశాఖ ప్రకటనలో పేర్కొంది.