మహారాష్ట్రలోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసర్ నుంచి పండరీపూర్‌కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఎక్స్‌ప్రెస్ వేపై ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అదుపుతప్పి రెండు వాహనాలు లోయలో పడియాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 45 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం రాత్రి ఒటి గంట సమయంలో జరిగిందని నవీ ముంబై డీసీపీ వివేక్ పన్సారే వెల్లడించారు. ఆషాడ ఏకాదశి సందర్భంగా బాధితులంతా పండరీపూర్ వెళ్తున్నారని తెలిపారు. క్షతగాత్రుల్లో 42 మందిని ఎంజీఎం దవాఖానకు, ముగ్గురిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించామన్నారు. అతివేగమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు వివేక్ పన్సారే తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నామని, పూర్తిగా దర్యాప్తు చేపట్టి మిగతా విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.